నేడు మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్న నితీశ్

తనకు ఏడు పార్టీల మద్దతు ఉందని ప్రకటన

nitish kumar
nitish kumar

పాట్నాః బిజెపితో తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నితీశ్ మంగళవారం గవర్నర్ ఫాగు చౌహాన్‌కు తన రాజీనామాను సమర్పించారు. అదే సమయంలో 164 మంది ఎమ్మెల్యేల జాబితాను కూడా అందజేశారు. ఇక, బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏడు పార్టీల మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు.

అదే సమయంలో నితీష్ నితీశ్ ప్రజా నిర్ణయానికి ద్రోహం చేశారని బిజెపి ప్రతిదాడికి దిగుతోంది. ‘2020 ఎన్నికల్లో మేం ఎన్డీఏ కూటమిలో భాగంగా కలిసి పోటీ చేశాం. నితీశ్ కుమార్‌ను సీఎం చేసినప్పటికీ జేడీయూ కంటే మేము ఎక్కువ సీట్లు సాధించాం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నదంతా బీహార్ ప్రజలకు, బిజెపికి ద్రోహం చేయడమే అవుతుంది’ అని బిజెపి బీహార్ అధ్యక్షుడు సంజయ్జైశ్వాల్ అన్నారు. నితీశ్ కుమార్ రాజకీయాలు పూర్తిగా సీఎం కుర్చీ కోసమే అని బిజెపి ఆర్‌కె సింగ్ విమర్శించారు. మరోవైపు జేడీయూతో జట్టు కట్టబోతున్న ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మంగళవారం బిజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తమ కూటమి భాగస్వాములను కాషాయ పార్టీ నాశనం చేసిందని ఆరోపించారు.

కాగా, నితీశ్ కుమార్ ఒక కూటమి నుంచి ముఖ్యంగా ఎన్డీయే నుంచి తప్పుకోవడం ఇదే తొలిసారి కాదు. 2013లో బిజెపి లోక్‌సభ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నరేంద్ర మోడీ నియమితులైన తర్వాత ఆయన తొలిసారిగా బిజెపితో పొత్తును ఉపసంహ రించుకున్నారు. అలాగే, 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. కానీ, తేజస్వి యాదవ్‌తో విభేదాల కారణంగా 2017లో ఆ మహా కూటమి నుంచి వైదొలిగారు. ఆ వాతావరణంలో పని చేయడం కష్టంగా ఉందని చెప్పి మళ్లీ ఎన్డీయేలో చేరి సీఎం పీఠాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు.

ఇక, బీహార్ లో జేడీయూ, ఆర్జేడీ కూటమి నూతన మంత్రి వర్గంలో బెర్త్‌లు ఇంకా ఖరారు కాలేదు. తేజస్వి యాదవ్‌కు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని, స్పీకర్‌ను ఆయన పార్టీ ఆర్జేడీ నుంచి ఎంపిక చేస్తారన్న ప్రచారం ఉంది. అలాగే, తేజస్వి హోం శాఖను కూడా కోరుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ శాఖ నితీశ్ దగ్గర ఉంది. ఇక, మహా కూటమిలోని ఇతర భాగస్వాములైన వామపక్షాలు, కాంగ్రెస్‌లు కూడా కొత్త ప్రభుత్వంలో బెర్త్‌లు పొందే అవకాశం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/