మోడీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ అన్నదే లేదుః కేంద్ర ఆర్థిక మంత్రి

ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రధాని కల అన్న నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీః గతంలో కేంద్ర ప్రభుత్వం 100 రూపాయలు విడుదల చేస్తే.. లబ్ధిదారులకు 15 రూపాయలు మాత్రమే చేరేవని.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత మొత్తం నేరుగా పేదవారికి చేరుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ అన్నదే లేదని చెప్పారు. ప్రధాని మోడీ దేశంలో ప్రతి ఒక్కరి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా పేదలకు అందేలా నగదు బదిలీ (డీబీటీ) అమలు చేస్తున్నారని తెలిపారు.

దేశం కన్నా ప్రధాని మోడీకి ఏదీ ఎక్కువ కాదని.. ప్రతి పేదవాడిని జన్ ధన్ ఖాతాలతో బ్యాంకుల దగ్గరకు తీసుకొచ్చారని నిర్మలా సీతారామన్ చెప్పారు. ముద్ర పథకం ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండా చిరు వ్యాపారులకు రుణాలు అందుతున్నాయన్నారు. చిరు వ్యాపారులు డైలీ ఫైనాన్స్ వ్యవస్థల నుంచి డబ్బులు తీసుకుని ఇబ్బందులు పడే పరిస్థితి తప్పిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ జన్మదినాన్ని సేవతో జరుపుకొంటున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి సొంతిల్లు అందించాలన్నది ప్రధాని మోడీ తాపత్రయమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేంద్రం ఇళ్లను మంజూరు చేసిందన్నారు. మోడీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/