బిజెపి, టిఆర్ఎస్ పార్టీల తీరుపై ఉత్తమ్ ఫైర్

టిఆర్ఎస్ , బిజెపి పార్టీల తీరు ఫై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రెండు పార్టీ లు మతపరమైన రంగు పూసి రాజకీయ లబ్ది పొందుతున్నాయన్నారు. హుజుర్నగర్లో జరిగిన తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో హైదరాబాద్ విలీన సమయంలో బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు పుట్టలేదన్నారు. ఆనాడు కేంద్రంలో జవహార్ లాల్ నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ నాయకత్వంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపారని గుర్తు చేశారు. అక్రమ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో టిఆర్ఎస్ , బిజెపి పార్టీలు వేడుకలు జరుపుతున్నాయని , మతపరమైన రంగు పూసి రాజకీయ లబ్ది పొందుతున్నాయని ఉత్తమ్ కుమార్ అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు గౌరవం ఉండేదని, కానీ తెలంగాణ ఏర్పడ్డాక పోలీసు వ్యవస్థను కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో సుమారు 115 మంది ఐపీఎస్ అధికారులు ఉంటే 45 మందికి పోస్టింగ్ లేదన్నారు. సిన్సియర్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో ఎస్పీ ప్రోద్బలంతోనే టిఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్లు ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కాళ్లు పట్టుకోవడం..ఎస్పీలతో ప్రభుత్వ కార్యక్రమంలో స్లోగన్స్ ఇప్పించుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.