పవన్ గుప్తా క్యురేటివ్‌ పిటిషన్‌ కొట్టివేత

3న ఉదయం 6 గంటలకు ఉరి తీసే అవకాశం!

supreme court
supreme court

న్యూఢిల్లీ: నిర్భయ దోషి పవన్ గుప్తా వేసిన క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని ఇటీవలే పవన్‌ గుప్తా పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన డెత్‌ వారెంట్లపై కూడా స్టే ఇవ్వాలని అతడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ కోర్టును కోరారు. ఈ నలుగురు దోషుల్లో ఇప్పటివరకు ఏ న్యాయపర అవకాశాలు వినియోగించుకోని దోషి పవన్‌ గుప్తా ఒక్కడే ఉన్నాడు. అతడి పిటిషన్‌ను కూడా ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టేయడంతో శిక్ష అమలుకు మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. కాగా నిర్భయ దోషులను ఈ నెల 3న ఉదయం 6 గంటలకు ఉరితీయడానికి ఇప్పటికే డెత్‌ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఉరి శిక్ష అమలును మరింత జాప్యం చేయడానికి దోషులు పిటిషన్‌లు వేస్తున్నారు. ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ను ఒకేసారి శిక్ష అమలుచేయనున్నారు.

మరోవైపు డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలని మరో దోషి అక్షయ్‌ కుమార్‌ ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది. తాను కొత్తగా కోర్టులో పిటిషన్‌ వేసినందుకు ఉరి శిక్ష అమలుపై స్టే ఇవ్వాలని కూడా అతడు కోర్టును కోరాడు. దీనిపై న్యాయస్థానం విచారణ జరుపుతోంది. నిర్భయ దోషుల్లో ఒకరి తర్వాత ఒకరు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్‌లు వేస్తూ ఉరి శిక్ష అమలులో జాప్యం అయ్యేలా చేస్తున్నారు. అన్ని రకాల న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/