నిపా వైరస్ కలకలం.. కేరళలో ఇద్దరు మృతి

నిపా వైరస్‌ అరుదైన, తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది. 1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్‌ కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది, ప్రస్తుతం ఈ వైరస్‌ కేరళలోకి ప్రవేశించింది. కరోనా మహమ్మారి ఏడాది క్రితం.. రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పటికీ ఏదోచోట ఈ మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. రోజుకో రకంగా రూపాంతరం చెందుతూ భయకంపితులను చేస్తోంది. ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోందని అనుకుంటుంటే.. ఇప్పుడు నిపా వైరస్‌ భయపెడుతుంది.

కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో రెండు అసహజ మరణాలు వెలుగులోకి వచ్చాయి. నిపా వైరస్​ కారణంగానే ఈ మరణాలు సంభవించినట్లు కేరళ ఆరోగ్య శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజున వైద్యాధికారులతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. సమీక్ష చేపట్టారు. అనంతరం ఘటనకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. మృతుల బంధువు కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

ఈ మరణాలకు గల కారణాలను అన్వేషించేందుకు కేరళ సర్కార్ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది . మంగళవారం మధ్యాహ్నం దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం రానుంది.