ఎన్‌ఐఏ అధికారుల కారుపై రాళ్ల దాడి

NIA team, probing blast case, attacked in West Bengal’s Bhupatinagar

కోలకతా: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ బృందంపై దాడి జరిగింది. మేదినీపూర్ జిల్లాలోని భూపతినగర్‌ లో 2022లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసులో ఎన్‌ఐఏ బృందం ఇవాళ దాడులు చేసేందుకు అక్కడికి చేరుకుంది. అయితే, భూపతినగర్‌ వాసులు ఎన్‌ఐఏ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్‌ఐఏ అధికారులను చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జనం అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులు గాయపడినట్లు తెలిసింది. వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

కాగా, భూపతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నార్యబిలా గ్రామంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడి ఇంటి వద్ద డిసెంబర్‌ 2022లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్‌ఐఏ అధికారులు 2023 జూన్‌లో దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఇవాళ భూపతినగర్‌కు వెళ్లారు.

జనవరిలో ఈ తరహా ఘటన బంగాల్​లో జరిగింది. రేషన్ పంపిణీ స్కామ్​ కేసులో ఉత్తర 24 పరగణాలు జిల్లా సందేశ్​ఖాలీలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన టీఎంసీ మద్దతుదారులు- ఈడీ అధికారులతో పాటు వారి వెంట వచ్చిన కేంద్ర బలగాలను చుట్టుముట్టారు. అనంతరం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈడీ అధికారుల వాహనాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీకి చెందిన ఇద్దరు అధికారులు గాయపడ్డారు.