మరికాసేపట్లో కొండగట్టుకు జనసేనాని..అడుగడుగునా అభిమానుల నీరాజనాలు

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు కు బయలుదేరారు. ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో వాహనాన్ని సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వాహనానికి సంబదించిన పూజా కార్యక్రమాలు ఈరోజు కొండగట్టులో జరపనున్నారు. ఇందుకు గాను పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం హైదరాబాద్ నుండి కొండగట్టు అంజన్న ఆలయం కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అభిమానులు , కార్య కర్తలు , ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. ఉదయమే వారాహి వాహనం కొండగట్టుకు చేరుకుంది. 11 గంటలకు పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకోవాల్సి ఉంది. కాకపోతే కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన వారితో చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ను మొదలుపెడతారు. సాయంత్రం 5:30 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.