జగన్ వైరస్‌కు వాక్సిన్ చంద్రబాబే – నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి జగన్ ఫై నిప్పులు చెరిగారు. జగన్ వైరస్‌కు వాక్సిన్ చంద్రబాబే అని సెటైర్ వేశారు. టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ వ్యాపారస్తుల ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్​ పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడికి జరుగుతున్న నష్టాన్ని వివరిస్తూ లోకేశ్​ కరపత్రం విడుదల చేశారు. బీహార్‌లో ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కూడా దాపురించిందని.. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో కూడా శాంతి భద్రతలు ఇంత దారుణంగా లేవన్నారు.

ఏపీలో రోడ్ల గురించి కేటీఆర్, హరీష్‌రావు, చినజీయర్ స్వామి కూడా విమర్శించిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. సిగ్గుతో దక్షిణ భారతదేశంలో బతుకుతున్నామని.. పక్క రాష్ట్రాల వాళ్ళు జగన్‌ను తుగ్లక్ అంటున్నారని.. జగన్‌కు శాశ్వత హాలీడే పలికే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కరోనాను ఎదుర్కొన్నాం కానీ.. జగన్ వైరస్‌ను ఎదుర్కోలేకపోతున్నామని.. జగన్ వైరస్‌కు వాక్సిన్ చంద్రబాబే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వైరస్‌ను చూసి ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలోకి రాలేదన్నారు.

జగన్ రెడ్డి, వైస్సార్సీపీ నేతల బెదిరింపులు, వేధింపులు, వాటాల దెబ్బలను తట్టుకోలేకే కంపెనీలు, వ్యాపారస్తులందరూ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఇసుక పాల‌సీ మార్చి భ‌వ‌న‌ నిర్మాణ‌ రంగాన్ని, దానికి అనుబంధంగా వున్న 130కి పైగా వ్యవస్థల్ని అస్థవ్యస్తం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం అనాలోచిత విధానాల‌తో విద్యుత్ కోత‌లు ఆరంభించి ప‌రిశ్రమ‌లకి ప‌వ‌ర్‌ హాలీడే ప్రక‌టించేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రైతుకు సబ్సిడీలో 1,14,000రూపాయలకే 40కేవీఏ ట్రాన్స్​ఫార్మర్​ అందిస్తే.. జగన్​ మాత్రం రూ.3,37,000 వ‌సూలు చేయ‌డం ఆక్వారంగానికి అద‌న‌పు భారం అన్నారు.