నారా లోకేష్‌ భుజానికి గాయం..?

యువగళం పాదయాత్రలో నారా లోకేష్ భుజానికి గాయం అయినట్లు తెలుస్తుంది. కుడి భుజం నొప్పితోనే నారా లోకేష్..పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పలువురు మహిళలు తన కుడిచేయి పట్టుకొని థాంక్స్ చెప్పాలని చూడడంతో కుడి భుజం నొప్పిగా ఉందంటూ ఎడమ చేతితో థాంక్స్ చెపుతూ వస్తున్నారు. దీంతో నారా లోకేష్‌ భుజానికి గాయం అయినట్లు బయటకు వచ్చింది. పాదయాత్ర చేస్తూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డికి కుడి భుజం నొప్పిగా ఉందని తెలిపారు. సెల్ఫీ తీసుకునే సమయంలో తన బిడ్డను ఎత్తుకొని ఫోటో తీసుకోవాలని లోకేష్ ను కోరగా తన చేయి నొప్పిగా ఉందంటూ మహిళతో చెప్పడం జరిగింది. ఇలా పలువురికి తన భుజం నొప్పి గా ఉందని చెప్పడంతో పార్టీ శ్రేణులు ఏంజరిగి ఉంటుందా అని ఆరాతీస్తున్నారు.

నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిన్నటితో విజయవంతంగా 45 రోజులు పూర్తీ చేసుకుంది. ఈ 45 రోజుల్లో లోకేష్ 577 కిలోమీటర్లు నడిచారు. జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. లోకేష్ యాత్ర కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. లోకేష్ సైతం ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ, అధికార పార్టీ ఫై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు నుండి ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది.

అన్నమయ్య జిల్లాను దాటుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోకి ప్రవేశించింది. ఈరోజు ఉదయం శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులోని చీకటిమానిపల్లి నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసారు. శ్రీసత్యసాయి జిల్లాకు చేరుకున్న లోకేశ్ పాదయాత్రకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలు గ్రాండ్ గా వెల్ కమ్ పలికారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, చెక్కభజనతో ఘనంగా స్వాగతం పలికారు.