పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీః ఇంట‌ర్నేష‌న‌ల్ క్రిమిన‌ల్ కోర్టు

పిల్లలను బలవంతంగా రష్యా తరలించినట్టు అభియోగాలు

Putin

కీవ్‌ః ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని హేగ్ నగరంలోని అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ లోని చిన్నపిల్లలను బలవంతంగా రష్యా తరలించారని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చిన్న పిల్లల అపహరణకు సంబంధించి పుతిన్ పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పుతిన్ తో పాటు రష్యా బాలల హక్కుల కమిషనర్ మరియా బెలోవా పైనా ఇదే తరహాలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

అయితే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆరోపణలను రష్యా నాయకత్వం తోసిపుచ్చింది. తాము ఉక్రెయిన్ లో ఎలాంటి యుద్ధ నేరాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. సదరు క్రిమినల్ కోర్టు ఆదేశాలు రష్యాకు వర్తించవని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చెందిన రోమ్ శాసనంలో రష్యాకు ఎలాంటి భాగస్వామ్యం లేదని, దానికి సంబంధించి రష్యా ఎలాంటి జవాబుదారీ కాదని ఆమె వివరించారు.

రష్యా వ్యాఖ్యలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధ్యక్షుడు పియోటర్ హాఫ్ మాన్ స్కీ ఖండించారు. రష్యా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవని, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు 123 దేశాలు జవాబుదారీగా ఉన్నాయని, తన పరిధిలోని దేశాల నేరాలను విచారించే అధికారం తమ కోర్టుకు ఉందని స్పష్టం చేశారు.