జనవరి నుండి నారా లోకేష్ పాదయాత్ర..

nara lokesh padayatra

ప్రస్తుతం రాజకీయ నేతలంతా కూడా పాదయాత్రనే నమ్ముకున్నారు. పాదయాత్ర తో ప్రజల్లోకి వెళ్లి పార్టీని గెలిపించుకునే పనిలో పడ్డారు. గతంలో పాదయాత్ర చేసిన నేతలంతా అధికారం చేపట్టడంతో ఇదే సెంటిమెంట్ గా మారింది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ అక్టోబరు నుంచే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించినప్పటికీ.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న తర్వాత చేపడితే బాగుంటుందన్న కారణంతో వచ్చే ఏడాది జనవరికి దానిని వాయిదా వేసినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి పండుగ తర్వాత యాత్ర ప్రారంభం అవుతుందని అంటున్నారు.

మొత్తం 450 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జనవరిలో ప్రారంభమై 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి యాత్ర ముగిసేలా రూట్‌మ్యాప్‌ను తీర్చిదిద్దుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని లోకేశ్ ప్రాథమికంగా నిర్ణయించారని చెబుతున్నారు. అన్ని ప్రాంతాలను సందర్శించేలా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, విరామం లేకుండా వారమంతా పర్యటన సాగించాలని లోకేశ్ యోచిస్తున్నట్టు సమాచారం. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం దసరా తర్వాత బస్సు యాత్ర చేపట్టబోతున్నారు.