గాల్వన్ లోయ నుంచి వెనక్కి తగ్గిన చైనా
దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెనక్కి తగ్గిన చైనా దళాలు

కశ్మీర్: తూర్పు గాల్వన్ లోయ ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి చైనా ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. ఆప్రాంతం నుండి సుమారు రెండు కిలోమీటర్ల దూరం చైనా దళాలు వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. వివాదాస్పదంగా మారిన ప్రాంతం నుంచి రెండు దేశాలు తాత్కాలిక నిర్మాణాలను తొలగించినట్లు అధికార వర్గాల ద్వారా వెల్లడైంది. జూన్ 15వ తేదీన ఎక్కడైతే ఘర్షణ జరిగిందో.. ఆ కీలక ప్రాంతం నుంచి చైనా దళాలు ఉపసంహరించినట్లు తెలుస్తోంది. 20 మంది సైనికులు చనిపోయిన ప్రదేశం వద్ద భారత్ .. ఇటీవల భారీగా బలగాలను మోహరించింది. బంకర్లు, తాత్కాలిక టెంట్లను నిర్మించింది. ఓ దశలో రెండు దేశాల సైనికులు.. ఎదురెదురుగా యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఉత్కంఠ నెలకొన్నది.
కాగా ఇరు దేశాలు పోటాపోటీగా సైనిక చర్యలకు సిద్ధం అవుతున్న రీతిలో సరిహద్దు ప్రాంతాల్లో చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి జరిగిన చర్చల ఫలితంగా గాల్వన్, పాన్‌గాంగ్ సో, హాట్ స్ప్రింగ్స్ నుంచి సైనికులను వెనక్కి పంపాలని ఇటీవలే ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దశల వారీగా ఇరు దేశాలు తమ సైన్యాన్ని వెనక్కు పిలిపించుకోవాలని భావిస్తున్నాయి. తొలి దశలో బలగాలను వెనక్కి పిలిపించిన తర్వాత.. చైనా సైన్యం నిజంగానే వెనక్కి వెళ్లిందా? అన్న అంశాన్ని నిర్ధారించుకుని, రెండో దశలో మరిన్ని బలగాలను ఉపసంహరించుకుంటామని భారత అధికారులు అంటున్నారు. మరోసారి త్వరలోనే ఇరు దేశాల అధికారులు సమావేశమయ్యే అవకాశం ఉంది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/