లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

ఎక్కడ చూసిన లోన్ యాప్ నిర్వాహకుల వేదింపులు ఎక్కువైపోతున్నాయి. వీరి వేదింపులు తట్టుకోలేక ఇప్పటికే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు ఆశ చూపడం..ఎలాంటి ఆధారాలు లేకుండానే డబ్బులు ఇవ్వడం ఆ తర్వాత అధిక వడ్డీ తో డబ్బును వసూళ్లు చేయడం చేస్తున్నారు. సకాలంలో డబ్బు చెల్లించకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ బెదిరింపులకు భయపడి చాలామంది ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలకే కాదు రాజకీయ నేతలకు సంబదించిన వ్యక్తులకు కూడా ఈ బెదిరింపులు వదలడం లేదు. తాజాగా వీరి వేదింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరులో బీటెక్ సెకండియర్ చదువుతున్న వీరేంద్రనాథ్.. ఖర్చుల కోసం లోన్ యాప్ ద్వారా స్వల్ప మొత్తం తీసుకున్నాడు. లోన్ యాప్‌లలో వడ్డీలు, చక్రవడ్డీలు కలిపి ఇంట్రెస్ట్‌లు భారీగా ఉంటున్నాయి. ఇలాగే వీరేంద్రనాథ్ తీసుకున్న రుణం వడ్డీలతో కలిపి రూ.5 వేలు అయ్యింది. ఇంట్లో వాళ్లకు చెప్పలేక, సమయానికి ఆ మొత్తం కట్టలేక ఆ విద్యార్థి సతమతమయ్యాడు. ఇదే సమయంలో నిర్వాహకుల నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి. వీరేంద్రనాథ్ స్నేహితులు, బంధువులకు అసభ్య మెసేజ్‌లు పంపించారు. డబ్బులు కట్టకపోతే కేసు పెట్టి అరెస్టు చేయిస్తామని బెదిరించారు. మనస్తాపానికి గురైన వీరేంద్రనాథ్.. ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎదిగిన కొడుకు కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.