ఓటమి భయం వైసీపీ రాక్షసుల్ని నరరూప రాక్షసులుగా మార్చేసిందిః లోకేశ్

nara-lokesh

అమరావతిః తిరుపతి జిల్లా పెళ్లకూరుమిట్టకు చెందిన గర్భిణి అరుణపై వైసీపీ నేత, ఎన్డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ అనుచరులు దాడి చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం ఆమె పొట్టపై కాళ్లతో తన్ని దాడి చేశారు. కడప జిల్లాలో ఉంటున్న బాధితురాలు ఓటేయడం కోసం పుట్టింటికి వచ్చారు. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం తిరుపతికి పంపించారు.

ఈ ఘటనను టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ రాక్షసుల్ని ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసిందని ఆయన మండిపడ్డారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరులో గర్భిణిపై వైసీపీ మూకల అమానుష దాడి దారుణమని అన్నారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీ పతనం ఖాయమని చెప్పారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.