సీఎం జగన్ రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారని నాదెండ్ల మనోహర్ సెటైర్లు

జనసేన నేత నాదెండ్ల మనోహర్ వైస్సార్సీపీ అధినేత , సీఎం జగన్ ఫై సెటైర్లు వేశారు. జగన్ రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారని అన్నారు. ఈరోజు మంగళవారం గుంటూరు జిల్లా తెనాలి లో నాలుగో ఏడాది మూడో విడ‌త వైయస్ఆర్ రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జ‌మ చేశారు. ఈ సందర్భాంగా ఉదయం జగన్ తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్లారు. తాడేపల్లి నుంచి కేవలం 28 కి.మీ దూరంలో ఉన్న తెనాలికి జగన్ హెలికాప్టర్ లో వెళ్లడం అవసరమా..రోడ్డు మార్గాన వెళ్ళకొడదా అని మనోహర్ ప్రశ్నించారు.

జగన్ రెడ్డి రోడ్డు మీద తిరగటం మర్చిపోయినట్లున్నారని సెటైర్లు పేల్చారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి తెనాలికి హెలికాప్టర్ లో వెళ్ళడం ఏంటి.. జనం నవ్వుకొంటున్నారని ఎద్దేవా చేశారు. జనం సొమ్ము జగన్ హెలీకాప్టర్ పర్యటనల పాలవుతోందని.. హెలికాప్టర్ డబ్బులతో రోడ్లు బాగవుతాయన్నారు. రోడ్డు మీద వెళ్తే గుంతలు.. పాడైపోయిన రోడ్లు ఉంటాయని హెలికాప్టర్లో వెళ్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలను మాత్రం గతుకుల రోడ్ల పాలుచేసి తను మాత్రం హాయిగా హెలికాప్టర్లో తిరుగుతున్నారని విమర్శించారు.

ఈరోజు తెనాలి లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం సృష్టించారన్నారు. నాయకులను అరెస్టు చేయడం, ప్రజలను బయటకు రానీయకపోవడం, షాపులు మూయించడం.. చూస్తుంటే రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారు అనిపిస్తోందన్నారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయమన్నారు.