ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూత..

టాలీవుడ్ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో రాజ్ తుదిశ్వాస విడిచారు. రాజ్ మరో సంగీత దర్శకుడు కోటి తో కలిసి దాదాపు180 చిత్రాలకు మ్యూజిక్ అందించారు. రాజ్-కోటి ద్వయం దశాబ్దాల పాటు సంగీతంతో సినీ ప్రేమికులను అలరించారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న తమ్ముడు విజయవంతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. హలో బద్రర్‌ సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు.

విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లో సిసింద్రీ, రాముడొచ్చారు. చిన్నిచిన్ని ఆశ తదితర చిత్రాలకు స్వరాలు అందించాడు. అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజ్ కుమారుడైన రాజ్ అసలు పేరు తోటకూరి సోమరాజు. 90వ దశకంలో వచ్చిన సినిమాలలో రాజ్ – కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. రాజ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రాజ్‌ మృతితో తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం అలుముకున్నది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.