బిజెపి కి మురళీధర్ రావు గుడ్ బై చెప్పబోతున్నారా..?

శనివారం బిజెపి 195 మంది తో కూడిన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణ నుండి 9 మంది పేర్లను ప్రకటించింది. నలుగురు సిట్టింగ్‌ ఎంపీలకు మరోసారి అవకాశమివ్వడంతో పాటు మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్‌ను బరిలో నిలిపింది. మూడు రోజుల క్రితం పార్టీలో చేరిన బీబీ పాటిల్‌ను జహీరాబాద్‌ అభ్యర్థిగా, నాగర్‌కర్నూల్‌ నుంచి ఎంపీ రాములు కుమారుడు పీ భరత్‌, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌కుమార్‌, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్‌, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్‌, హైదరాబాద్‌ అభ్యర్థిగా మాధవీలతను ప్రకటించింది.

కాగా మల్కాజ్‌గిరి టికెట్ ఇస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మురళీధర్ రావు కు అధిష్టానం షాక్ ఇచ్చింది. ఈయనకు కాకుండా ఈటెల కు టికెట్ ఇవ్వడం ఫై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘‘గత కొన్నేళ్లుగా మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో నాకోసం పనిచేసిన నా సహచరులు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు. త్వరలో మీ అందరినీ వ్యక్తిగతంగా కలుస్తాను. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను’’ అని మురళీధర్ రావు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. మురళీధర్ రావు బీఆర్ఎస్లోకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఆయన మల్కాజ్గిరి అభ్యర్థిగా బరిలో ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈయన నిజంగా బిఆర్ఎస్ లో చేరుతున్నారా లేదా అనేది చూడాలి.