చీకటిని పారదోలే దీపావళి శుభాకాంక్షలు

ఈసారి జరుపుకుంటోన్న దీపావళికి ప్రత్యేకత ఉంది.. ఆస్ట్రేలియా ప్రధాని

చీకటిని పారదోలే దీపావళి శుభాకాంక్షలు
Australian PM Scott Morrison

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వేళ ఈ పండుగ మరింత ప్రత్యేకమైందని చెప్పారు. చీకటిని పారదోలే దీపావళి గురించి ఎన్నో ఏళ్లుగ గుర్తుచేసుకుంటున్నామని ఆయన చెప్పారు. అయితే, అనుభవపూర్వకంగా మాత్రం ఎన్నడూ తెలుసుకోలేదని అన్నారు. ఈసారి జరుపుకుంటోన్న దీపావళికి ప్రత్యేకత ఉందని, ప్రతి దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని గుర్తు చేశారు. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. దీని వల్ల చాలా మంది జీవనోపాధిని కోల్పోయారని, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు.

అయినప్పటికీ, ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరం అండగా నిలిచామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై జరుగుతున్న పోరాటంలో ముందున్న సిబ్బంది నుంచి స్ఫూర్తి పొందామని తెలిపారు. ఈ ఏడాది పూర్తిగా చీకటిని చూశామని, ప్రస్తుతం వెలుతురు చీకటిని క్రమంగా కమ్మేస్తోందని చెప్పారు. సమీప భవిష్యత్తులో మరింత ప్రకాశవంతమైన రోజులున్నాయని ఆయన చెప్పారు. ఈ మేరకు వీడియో రూపంలో ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆస్ట్రేలియాలో 70 లక్షల మంది వరకు భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు. భారతీయులు అక్కడ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆయన దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా సందేశాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా భారత్ మధ్య ఇటీవలి కాలంలో సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. చైనా చర్యలను ఇరు దేశాలు ఖండిస్తున్నాయి.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/