రానున్న 5 రోజులు జాగ్రత్త..ఎండ తీవ్రత మరింత

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుండే ఎండలు విపరీతమైన సంగతి తెలిసిందే. ఇక మార్చి నెల మొదలు కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా 38 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటె రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటాయో అని ప్రజలు భయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో రానున్న 5 రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సగం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ దాటాయి.

అత్యధికంగా సిద్దిపేట, ములుగు, వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా రికార్డ్ అవుతున్నాయి. ఆదివారం నుంచి గురువారం వరకు ఎండల తీవ్రత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని , ఏమైనా పనులు ఉంటె ఉదయం , సాయంత్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.