వాలంటీర్ వ్యవస్థ మన పార్టీకి అవసరమా..? అంటూ వైస్సార్సీపీ ఎంపీ సూటి ప్రశ్న

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఫై రగడ నడుస్తుంది. వాలంటీర్ వ్యవస్థ లో కొంతమంది చెడు పనులు చేస్తున్నారని , ప్రజలకు సంబందించిన రహస్య వివరాలను బయటకు చేరవేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా చర్చించుకున్నారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పకుండా , అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఫై దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్న రఘురామ కృష్ణం రాజు వాలంటీర్ వ్యవస్థ ఫై పలు వ్యాఖ్యలు చేసారు.

ప్రభుత్వ సొమ్ముతో మన పార్టీకి సోకు చేసుకోవడానికి కావలసిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని ప్రజలందరూ పసిగట్టారని, ప్రభుత్వానికి అక్కరకు లేని, మన పార్టీకి కావలసిన వ్యవస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ అని, పార్టీ సభ్యుడిగా నేను ప్రశ్నిస్తున్నాను… ముఖ్యమంత్రి గారు గుండెల మీద చేయి వేసుకొని సమాధానం చెప్పండని, వాలంటీర్ వ్యవస్థ మన పార్టీకి అవసరమా?, ప్రజలకు అవసరమా??, ప్రజలను ఎన్నాళ్ళని వెర్రి పప్పలను చేస్తారు, అయినా ప్రజలెవరూ మనల్ని విశ్వసించడం లేదని ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తమ పార్టీ నాయకులే రెచ్చగొట్టారని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తరువాత, వాలంటీర్లపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తమ పార్టీ నాయకులు కొత్త రాగాన్ని అందుకున్నారని, వాలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవ ఏమిటి?, వాలంటీర్ వ్యవస్థ అన్నది అవసరమా? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. ప్రజలకు వాలంటీర్లు చేస్తున్న మేలు ఏమిటి?, తమ పార్టీకి చేస్తున్న మేలు ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలుసునని, ప్రతి కుటుంబం వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్న విషయం ప్రజలందరికీ తెలిసిపోయిందని, గతంలో వాలంటీర్ వ్యవస్థపై తాను మాట్లాడానని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని, ధైర్యంగా అందరూ మాట్లాడుతూనే ఉన్నారని తెలిపారు.