ఇకపై భారత భూభాగం నుంచే కైలాస పర్వతాన్ని రూటు !

ఇండియా – చైనా సరిహద్దుల్లో లిపులేక్ పాస్ వరకు రోడ్డు నిర్మాణం

Mount Kailash to become accessible from India from September

పిత్తోర్‌ఘ‌ర్‌: హిందువులకు అత్యంత పవిత్రమైన, సాక్షాత్తు శివుడు కొలువుంటాడని కోట్లాది మంది విశ్వసించే కైలాస్, మానస సరోవరాన్ని ఇకపై భారత్ నుంచే దర్శించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కైలాస పర్వతాన్ని వీక్షించేందుకు భారత భూభాగం నుంచే రోడ్డు మార్గాన్ని వేస్తున్నారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇది ఈ సెప్టెంబర్ కల్లా సిద్ధమవుతుందని భావిస్తున్నారు.

భారత్ – చైనా సరిహద్దుల్లో ఉన్న కేఎంవీఎన్ హట్స్ నుంచి లిపులేక్ పాస్ వరకు ఆరున్నర కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ మార్గం నుంచి కైలాస పర్వతాన్ని వీక్షించవచ్చు. కైలాస్ వ్యూపాయింట్ ను భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. లిపులేక్ పాస్ ద్వారా చేపట్టాల్సిన కైలాస్ మానస సరోవర యాత్ర కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో, మన భూభాగం నుంచి కైలాసగిరిని వీక్షించేందుకు వ్యూపాయింట్ ను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.