రేపు జైపూర్‌లో పర్యటించనున్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు

PM Modi, France’s Emmanuel Macron to visit Jaipur on Jan 25, see tourist spots

న్యూఢిల్లీః ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న విషయం తెలిసిందే. రెండు రోజులపాటు ఆయన మన దేశంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా 25వ తేదీన మాక్రాన్‌ భారత్‌కు చేరుకుంటారు. గురువారం జైపూర్‌ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి ప్రధాని మోడీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మోడీ తో కలిసి మాక్రాన్‌ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన 16వ శతాబ్దానికి చెందిన అమెర్ ఫోర్ట్‌ను సందర్శించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఇద్దరు నేతలు ట్రిపోలియా గేట్‌కు కాలినడకన వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జైపూర్‌లో ఇద్దరు నేతలు రోడ్‌ షో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన తర్వాత మాక్రాన్‌ గురువారం రాత్రికి దేశరాజధాని ఢిల్లీకి చేరుకుంటారు. జనవరి 26వ తేదన జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రెండు రోజుల పర్యటనలో భారత్‌తో మాక్రాన్‌ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్‌ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు తెలుస్తోంది.