వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి

ఇరాక్‌లోని నినెవే ప్రావిన్స్‌లోని హమ్దానియా జిల్లాలో ఓ వివాహ వేడుకలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వందమందికిపైగా మరణించారు. దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి.

నినెవే డిప్యూటీ గవర్నర్ హసన్ అల్-అల్లాక్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ ..100 మందికి పైగా మరణించినట్లు ధృవీకరించారు. వేడుక సందర్భంగా బాణాసంచా కాల్చడం వల్ల హాల్‌లో మంటలు చెలరేగాయని స్థానిక పౌర రక్షణ విభాగం తెలిపింది. ‘హాల్ నుండి మంటలు ఎగసిపడటం మేం చూశాం. చాలా మంది అందులో చిక్కుకుపోయారు..’ అని మంటల నుంచి తప్పించుకున్న 34 ఏళ్ల ఇమాద్ యోహానా చెప్పారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం భవనం మంటలు త్వరగా అంటుకునే స్వభావం గల నిర్మాణ సామగ్రితో నిర్మితమైందని, ఇది వేగంగా కూలిపోవడానికి కారణమని స్థానిక మీడియా తెలిపింది. అధికారిక ప్రకటనల ప్రకారం ఫెడరల్ ఇరాకీ అధికారులు, ఇరాక్ సెమీ అటానమస్ కుర్దిస్తాన్ ప్రాంతం నుంచి అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని ఘటనాస్థలికి పంపించారు. రాత్రి 10:45 గంటల సమయంలో భవనంలో మంటలు చెలరేగినట్లు ఘటనా స్థలం వద్ద ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.