కొవిషీల్డ్ తీసుకున్న వారికే అమెరికాలోకి అనుమతి

ప్రయాణికులను అనుమతించే 33 దేశాల జాబితాలో భారత్

న్యూఢిల్లీ : నవంబరు నెల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేయనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏయే దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించేది తెలుపుతూ 33 దేశాల జాబితాను అమెరికా వెల్లడించింది. దీనిలో చైనా, భారత్, ఇరాన్, ఫ్రాన్స్, యూకే తదితర దేశాలున్నాయి. అలాగే అమెరికా రెగ్యులేటరీ సంస్థ ఎఫ్‌డీఏ లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గుర్తింపు లభించిన వ్యాక్సిన్లు తీసుకున్న వారికే దేశంలోకి అనుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. అయితే ఈ రెండు సంస్థల్లో దేనినుంచి కూడా కోవాగ్జిన్‌‌కు గుర్తింపు లభించలేదు. ఏ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలనే నిర్ణయం యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చేతుల్లో ఉందని అధికారులు తెలిపారు.

ప్రస్తుతానికి డబ్ల్యూహెచ్‌వో నుంచి కేవలం 7 వ్యాక్సిన్లకే అనుమతి లభించింది. అవి మోడెర్నా, ఫైజర్-బయాన్‌టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్, సైనోఫామ్, సైనోవాక్. ఈ జాబితాలో కోవాగ్జిన్‌తోపాటు భారత్‌లో ప్రజలకు అందిస్తున్న రష్యా వ్యాక్సిన్ స్ఫుత్నిక్ కూడా లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ప్రస్తుతానికి కోవిషీల్డ్ తీసుకున్న వారికి మాత్రమే అమెరికా ప్రయాణానికి అనుమతి లభించే పరిస్థితి కనిపిస్తోంది. తాజా నిబంధనల ప్రకారం నవంబరు నుంచి అమెరికాలో ప్రవేశించే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం కూడా లేదు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/