మోర్బీలో వంతెన కూలిన ఘటన.. నవంబర్ 14న సుప్రీంలో విచారణ

Morbi bridge collapse: Supreme Court to hear PIL for judicial probe on November 14

న్యూఢిల్లీః గుజరాత్‌లోని మోర్బీలో వంతెన కూలిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. న్యాయవాది విశాల్‌ తివారి ఈ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేశారు. వంతెన కూలిన ఘటనలో వందకుపైగా ప్రాణాలు కోల్పోయారని, ఇందులో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, పూర్తి వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందని పిటషనర్‌ ఆరోపించారు.

గత దశాబ్దం నుంచి దేశంలో వివిధ సంఘటనలు జరిగాయని, వీటిలో నిర్వహణ లోపం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, లోపాల కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించిన సందర్భాలున్నాయని, వీటిని నివారించవచ్చని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్‌ యూయూ లలిత్‌ ఎదుట మంగళవారం న్యాయవాది విశాల్‌ తివారి వాదనలు విపించారు. పిటిషన్‌పై ప్రార్థన ఏంటని? సీజేఐ జస్టిస్‌ లలిత్‌ న్యాయవాదిని ప్రశ్నించగా.. తివారి స్పందిస్తూ న్యాయ విచారణ కమిషన్‌ను కోరుతున్నట్లు తెలిపారు.

ఈ మేరకు ఈ నెల 14న పిటిషన్ జాబితా చేయాలని ఆదేశించారు. ఈ నెల 30న మోర్బీలో మచ్చు నదిపై వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 సంవత్సరాలకుపైగా చరిత్ర ఉన్న తీగల వంతెనను కొద్ది రోజుల కిందట మరమ్మతుల నేపథ్యంలో మూసివేశారు. ఈ బాధ్యతలను ఒరేవా గ్రూప్‌కు అప్పగించారు. గతవారంలో వంతెనను తిరిగి ప్రారంభించగా.. కూలిపోయింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/