లోక్ సభ, రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా

మణిపూర్ ఘటనపై అట్టుడుకనున్న పార్లమెంట్

Monsoon Session: Lok Sabha adjourned till 2 pm, Rajya Sabha till 12 pm

న్యూఢిల్లీ: ఈరోజు నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఇటీవల మృతి చెందిన సభ్యులకు ఉభయసభలు నివాళి అర్పించాయి. ఉభయసభల సభ్యులు మౌనం పాటించారు. అనంతరం రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు, లోక్ సభ 2 గంటల వరకు వాయిదా పడింది.

ఈనాటి సమావేశాల్లో మణిపూర్ ఘటన వేడి పుట్టించే అవకాశం ఉంది. విపక్ష పార్టీలన్నీ ఈ అంశంపై చర్చకు పట్టుబడుతున్నాయి. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్ చేయనున్నాయి. మరోవైపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే… పార్లమెంటు ప్రాంగణంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ మణిపూర్ ఘటనపై మాట్లాడారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన విషయం తెలియగానే తన హృదయం ఆవేదనతో నిండిపోయిందని చెప్పారు. ఈ ఘటన యావత్ దేశ ప్రజలకు సిగ్గుచేటని అన్నారు. మహిళల రక్షణ విషయంలో ముఖ్యమంత్రులు అందరూ కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.