మణిపుర్‌ ఘటనను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం

రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే ఏం చేస్తున్నారు..

manipur violence Supreme Court takes suo motu cognisance

న్యూఢిల్లీ: మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారని కేంద్రం, మణిపుర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మహిళలపై అమానవీయ ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. బహిర్గతమైన వీడియోలతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే తామే చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా, మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తాజాగా బయటపడింది. మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో అక్కడి మహిళలు తీవ్ర వ్యధను అనుభవించారు. ఓ వర్గం వారు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేశారు. అనంతరం వారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి ఆర్తనాదాలను ఎవరూ పట్టించుకోకుండా వికృతంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి కారణంగానే దారుణాలు జరుగుతున్నట్టు పలువురు మండిపడుతున్నారు.