నేడు అయోధ్యలో దీపోత్సవం..పాల్గొననున్న ప్రధాని మోడీ

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యూపీలోని అయోధ్యలో ఆదివారం ఘనంగా దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ దీపోత్సవ వేడుకలో మొదటిసారి ప్రధాని మోడీ హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా దాదాపు 18 లక్షల మట్టి దీపాలు వెలిగించనున్నారు. ఈ వేడుకలో బాణసంచా, లేజర్ షో ,రాంలీలా కూడా ప్రదర్శించబడతాయి. అయోధ్యలో దీపోత్సవ వేడుకలు నిర్వహించడం ఇది ఆరోసారి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అయోధ్య నగరంతో పాటు సరయు నది తీరంలో దీపోత్సవం వేడుకలకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సృష్టించడానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పురాణాల విశిష్టతను తెలిపే విధంగా రామకథ ఆధారంగా 35 స్వాగత ద్వారాలను కూడా వివిధ మార్గాల్లో సిద్ధం చేశారు.

సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 22,000 మందికి పైగా వాలంటీర్లు 1.5 మిలియన్ల మట్టి దీపాలను వెలిగిస్తారు. మిగిలిన దీపాలను అయోధ్యలోని భారీ కూడళ్లలో, ఇతర ప్రదేశాలలో వెలిగించనున్నారు. ఒక చౌరస్తాలో 256 మట్టి దీపాలను వాలంటీర్లు ఏర్పాటు చేస్తారని దీపోత్సవ నిర్వాహకులు తెలిపారు. రెండు చతురస్రాల మధ్య దూరం రెండు నుండి మూడు అడుగుల వరకు ఉంటుంది. ఇక మోడీ 3 గంటలకు పైగా అయోధ్యలో ఉండనున్నారు.

దీపోత్సవ వేడుకల్లో భాగంగా మోడీ రామకథా పార్క్ వద్ద రామ, లక్ష్మణ, సీతలకు హారతి నివ్వనున్నారు. రామ పట్టాభిషేకం అనంతరం.. రామ మందిర నిర్మాణ పనులను కూడా ప్రధాని పరిశీలించనున్నారు. దీంతోపాటు బాణాసంచా కాల్చడం, సరయూ ఆరతి తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు.