జనసేన నేతలు బెయిల్ మీద బయటకు రావడం ఎంతో సంతోషంగా ఉంది – పవన్

వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఘటనలో తొమ్మిది మంది జనసేన నేతలు బెయిల్ ఫై బయటకు రావడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేసారు. జనసేన నేతలు జైలులో ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారో తనకు తెలుసన్నారు. జైలులో ఉన్న నేతల కోసం న్యాయ పోరాటం చేసిన పార్టీ లీగల్ సెల్ సభ్యులకు, వారికి అండగా నిలిచిన న్యాయవాదులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు.

ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వైజాగ్ లో అక్రమాలు, తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతున్నదెవరో విశాఖ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ వాస్తవాలు బయటకొస్తాయనే తాము చేపట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వం డ్రామా చేసిందని ఆరోపించారు. జనసేన నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించిందని పవన్ తెలిపారు. నియమనిబంధనలకు నీళ్లొదలి అరెస్టులకు పాల్పడ్డారని, మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ అంశంపై కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.