ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డు దరఖాస్తులు క్లియర్ చేయాలి !
ప్రతిపాదనకు అనుకూలంగా అడ్వైజరీ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం

వాషింగ్టన్: గ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లోగా క్లియర్ చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్‌కు తమ ప్రతిపాదనలను పంపింది. ఈ సిఫారసుకు అధ్యక్షుడి ఆమోదం లభిస్తే.. అమెరికాలో శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ అమెరికన్లకు మోక్షం లభించినట్టే అవుతుంది. గ్రీన్ కార్డును శాశ్వత నివాస గుర్తింపు కార్డుగా చూస్తారు. ఇది ఉంటే అమెరికాలో చట్టబద్దమైన శాశ్వత నివాస హోదా లభించినట్టే.
భారత్ నుంచి అమెరికాలో అడుగుపెట్టే ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎంతో నైపుణ్యాలున్నవారే. వీరంతా హెచ్1బీ వీసాపై వస్తారు. వీరు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే అందరికీ వస్తుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే ప్రతీ దేశానికి ఏడు శాతం కోటా పరిమితి విధించారు. దీంతో చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం చాన్నాళ్లుగా వేచి చూస్తున్నారు. భారీగా పేరుకుపోయిన ధరఖాస్తుల విధానాన్ని సంస్కరించేందుకు వీలుగా అడ్వైజరీ కమిటీ ఆరు నెలల కాల పరిమితికి అనుకూలంగా సిఫారసు చేయాలని నిర్ణయించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/