చంద్రయాన్ విజయం పట్ల మోడీ హర్షం

చంద్రయాన్ 3 విజయం పట్ల దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. స్వీట్స్ పంచుతూ , బాణా సంచా కలుస్తూ ఇస్రో ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ విజయం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేసారు. చంద్రయాన్‌ – 3 ప్రయోగాన్ని దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌ గా వీక్షించిన ప్రధాని.. ఈ ప్రయోగం విజయవంతం అయిన వెంటనే జాతీయ జెండా రెపరెపలాడించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించారు.

ఇలాంటి చారిత్రిక ఘట్టాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుందని అన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ..ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారని గుర్తుచేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాం అని సగర్వంగా చెప్పిన ప్రధాని… చంద్రయాన్‌ ఘన విజయంతో తన జీవితం ధన్యమైందని అన్నారు. తాను బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నా.. తన మనసంతా చంద్రయాన్‌ పైనే ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఏ దేశమూ చేరుకోలేదని గుర్తుచేసిన ప్రధాని… మన శాస్త్రవేత్తల కఠోర శ్రమవల్లే ఈ విజయం సాధించగలిగామని ప్రకటించారు.