మునుగోడులో టీఆర్ఎస్ కు భారీ షాక్..బిజెపిలో చేరిన కీలక నేతలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక వేడి నడుస్తుంది. టీఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టి హోరెత్తిస్తున్నారు. ఎవరికీ వారు సభలు , సమావేశాలు చేస్తూ వెళ్తున్నారు. ఇక ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని ఎవరికీ వారు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.

మునుగోడుకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన రోజే కారు పార్టీకి జులక్ ఇచ్చారు సీనియర్ నేత. రాత్రికి రాత్రే టీఆర్ఎస్ పార్టీని విడి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో కమలం గూటికి చేరారు. మునుగోడు నియోజకవర్గ సీనియర్ నాయకులు చండూరు జెడ్పిటిసి సభ్యులు కర్నాటి వెంకటేశం తో పాటు గట్టుపల్ ఎంపిటిసి అవ్వారి గీత శ్రీనివాస్, ఉడుతలపల్లి ఉపసర్పంచ్ గంట తులసయ్య బిజెపిలో చేరారు. కర్నాటి వెంకటేశం తో పాటు వందలాది మంది టిఆర్ఎస్ కార్యకర్తలు బిజెపిలో చేరారు. ఇది నిజంగా టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ అనే చెప్పాలి.

మునుగోడు ఉప ఎన్నిక బరిలో బిజెపి నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ దిగుతుండగా..కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుంది. ఇక టీఆరఎస్ నుండి ఎవరు బరిలో దిగుతారా అనేది గత కొద్దీ రోజులుగా చర్చ గా మారింది. అయితే టిఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ పార్టీ కేడర్‌కు కూసుకుంట్ల అభ్యర్దిగా సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది. అలాగే మునుగోడు నియోజకవర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు చేపట్టాలని టీఆర్ఎస్ ప్లాన్ చేసింది.