బుధవారం నుంచి అందుబాటులోకి ఎంఎంటీఎస్ రైళ్లు

10 రైళ్లు నడిపేందుకు అనుమతి ఇచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ

హైదరాబాద్: నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు మళ్లీ కూతకు రెడీ అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో వీటిని పట్టాలెక్కించాలని అధికారులు నిర్ణయించారు. ఎల్లుండి (బుధవారం) నుంచి పది ఎంఎంటీఎస్ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అందుబాటులోకి రానున్న రైళ్లలో మూడు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు మూడు, హైదరాబాద్ నుంచి లింగంపల్లికి రెండు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు రెండు రైళ్లు నడవనున్నాయి. ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే తొలి రైలు ఉదయం 7.50 గంటలకు బయలుదేరనుండగా, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే తొలి రైలు ఉదయం 9.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్లే మొదటి రైలు ఉదయం 8.43 గంటలకు బయలుదేరనుండగా, హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు ఉదయం 9.36 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/