హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ , సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీకి బయలుదేరారు. కవిత తన నివాసం నుంచి బుధువారం సాయంత్రం 4 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. మార్చి 9వ తేదీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. ప్రగతిభవన్ లో తండ్రి, సీఎం అయిన కేసీఆర్ తో సమావేశం అవుతారని అందరూ భావించారు. అలాంటిది ఏమీ జరగలేదు. ఇంటి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో కవిత వెంట ముఖ్య అనుచరులు, పార్టీ నేతలు భారీ కాన్వాయ్ తో వెళ్లారు. అంతకు ముందు కవితతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలుచెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని.. మహిళా రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాన్ని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాను యధావిధిగా కొనసాగించాలని కేసీఆర్ కవితకు సూచించినట్లుగా సమాచారం.

బిజెపి ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడుదామని, బిఆర్ఎస్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత కవిత ఢిల్లీ బయలుదేరారని తెలుస్తుంది. ముందుగా నిర్ణయించుకున్నట్లుగా జంతర్ మంతర్‌లో ధర్నా ఉన్నందున మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ జారీ చేసిన నోటీసుల విషయంలో కవిత రిక్వెస్ట్ లెటర్ పంపారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీ విషయంలో మార్పు కోరారు. పదిహేనో తేదీ తర్వాత తాను విచారణకు హాజరవుతానని లేఖలో కోరారు. దీనిపై ఈడీ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఈడీ స్పందించకపోతే కవిత విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.