మరోసారి ఈడీ ఆఫీసుకు కవిత న్యాయవాది సోమా భరత్

ED Headquarters

న్యూఢిల్లీః బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత న్యాయవాది సోమా భరత్ నేడు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. కవిత ఫోన్ల నుంచి ఈడీ అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కు ఈడీ జాయింట్ డైరెక్టర్ తాజాగా లేఖ రాసిన విషయం తెలిసిందే. తాము కవిత అందించిన మొబైల్ ఫోన్ల ను తెరిచేందుకు సిద్ధమయ్యామని లేఖలో తెలిపారు. ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా హాజరుకావడం లేదా తన ప్రతినిధిని పంపాల్సిందిగా లేఖలో ఈడీ పేర్కొంది. కవిత తరపున ఈడీ కార్యాలయానికి బిఆర్ఎస్ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ వెళ్లారు. నేడు కూడా ఫోన్లలో సమాచారాన్ని సేకరిస్తుండటంతో నేడు కూడా భరత్ హాజరయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్సీ కవిత వ్యక్తిగత మొబైల్‌ను మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ స్టేట్మెంట్, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను తన న్యాయవాది సోమా భరత్‌ ద్వారా ఈడీకి పంపారు. తరువాత రెండోరోజు కవిత విచారణకు హాజరైన క్రమంలో కొన్ని మొబైల్ ఫోన్స్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మొబైల్ ఫోన్లను సీల్డ్ కవర్‌లో మీడియాకు చూపించారు. అయితే మొబైల్ ఫోన్లలో సమాచార సేకరణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.