రూ.169 కోట్లకు చేరిన యాదాద్రి ఆలయం వార్షిక ఆదాయం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ వార్షిక ఆదాయం రూ.169 కోట్లకు చేరింది. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత భక్తులు తాకిడి ఎక్కువైంది. గతంలో కేవలం తెలంగాణ నుండే భక్తులు వచ్చే వారు. కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ స్వామి వారిని దర్శించుకుంటూ కానుకలు సమర్పిస్తున్నారు. వీటితో పాటు టికెట్లు, ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత 2022– 23లో ఆలయం వార్షిక ఆదాయం రూ.169 కోట్లకు చేరుకుంది. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన కొత్తలో ఆలయ వార్షిక ఆదాయం రూ. 61 కోట్లు ఉండగా.. అది ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది.

టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2021-22 ఏడాదిలో దాదాపు 73 లక్షల మంది వచ్చేవారని, ఆలయ పునరుద్ధరణ తర్వాత అనేక సౌకర్యాలు కల్పించడంతో భక్తుల సంఖ్య 86 లక్షలకు చేరుకుందని ఆలయ అధికారులు తెలిపారు. హైదరాబాద్ కు సమీపంలో ఉండటంతో సాధారణ రోజుల్లో రోజుకు ఐదు వేల మంది.. వారంతాల్లో 40 వేల మంది వరకు దర్శనానికి వస్తున్నారని అధికారులు చెప్పుకొచ్చారు.