సెప్టెంబర్‌ 1 నుంచి షూటింగ్లు మొదలు

సెప్టెంబర్‌ 1 నుంచి సినిమా షూటింగ్ లు మొదలుకాబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆగ‌స్టు 25 నుంచి విదేశాల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్న సినిమాల షూటింగ్స్ షురూ కానున్నాయని , సెప్టెంబ‌ర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ మొదలుకాబోతున్నాయని తెలిపారు.

మంగళవారం జరిగిన సమావేశం గురించి దిల్‌ రాజు మాట్లాడారు. ‘‘చిత్ర పరిశ్రమలోని సమస్యళపై 23 రోజులుగా రోజుకు ఐదారు గంటలు మాట్లాడుకుంటున్నాం. అన్ని శాఖలవారితో చర్చలు జరిపాం. ఈ నెల 30న తుది నిర్ణయాలు వెల్లడిస్తాం. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు వీపీఎఫ్‌ సమస్య పరిష్కారమైంది. తెలుగు రాష్ట్రాల్లో 1800 థియేటర్లు ఉన్నాయి. వచ్చే నెల రెండో తేదీ నుంచి వీఫీఎఫ్‌ ఛార్జీలు వసూలు చేయడం లేదు. టికెట్‌ ధరలు, తినుబండారాలు అందుబాటు ధరల్లో ఉంటాయి. పెద్ద సినిమాలకు ఒక శ్లాబ్‌ ప్రకారం టికెట్‌ ధరలుంటాయి. నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిబిటర్లకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగిస్తుంది. భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది’’ అని దిల్‌ రాజు అన్నారు.

అలాగే హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా చర్చ జరిగింది. ఈ మేరకు టాలీవుడ్‌ హీరోయిన్లు, ఆర్టిస్ట్‌లకు సంబంధించిన మేనేజర్లు అంతా నిర్మాతలతో భేటీ అయ్యారు. అధిక పారితోషికాలు, సిబ్బందికి సంబంధించిన ఖర్చులు గురించి చర్చించారు. దీనిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు దిల్‌ రాజు తెలిపారు. ఆ నిర్ణయాలే ఏంటనేది ‘మా’ అసోసియేషన్‌ ద్వారా ఆర్టిస్ట్‌లకు సమాచారం అందుతుంది. అలాగే మిగిలిన యూనియన్లు, ఫెడరేషన్‌ ద్వారా సమాచారం అందజేస్తాం. 90 శాతం చర్చలు పూర్తయ్యాయి. ఇక 3 శాఖలకు సంబంధించిన చర్చలు ఉన్నాయని, అవి కూడా ఈ నెల 30వ తేదీకి పూర్తవుతాయని చెప్పారు.