రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు..ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ – బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేయడం ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ అన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లోక్‌ సభ జనరల్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌ ను రిలీజ్‌ చేశారు. దీనిపట్ల యావత్ రాజకీయ నేతలు బిజెపి ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ లు తమ స్పందనను తెలుపగా..తాజాగా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు ప్ర‌జాస్వామ్యానికి మ‌చ్చ అన్నారు. పైకోర్టులో అప్పీల్‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలిసి వేటు వేశారు. ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చే మోడీ మిష‌న్‌లో భాగంగానే రాహుల్ గాంధీపై అన‌ర్హ‌త వేటు వేశార‌ని పేర్కొన్నారు. వైఫ‌ల్యాలు, అవినీతి మిత్రుల నుంచి దృష్టి మ‌ళ్లించేందుకుమోడీ య‌త్నిస్తున్నార‌ని క‌విత ఆగ్రహం వ్యక్తం చేసారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని బిఆర్ఎస్ అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. ఇది ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని అన్నారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజుగా కేసీఆర్ అభివర్ణించారు. మోడీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిందన్నారు . నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోడీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారని విమర్శించారు. పార్టీల మధ్య వైరుధ్యాలకు ఇది సందర్భం కాదన్న కేసీఆర్… దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.

అలాగే మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా ఖండించారు. ఆయనపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమేనని ఆరోపించారు. అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో రాహుల్ పై వేటు వేశారని కేటీఆర్ అన్నారు. ఇది తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ తత్తవేత్త వాల్ టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్ కోట్స్ ను మంత్రి కేటీఆర్ జత చేశారు. రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సపోర్టు చేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.