కాసేపట్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

కాసేపట్లో తెలంగాణలోని ఆరు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబదించిన పోలింగ్ జరగనుంది. స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే, ఆరుగురు ఎమ్మెల్సీలు ఏక్ర‌గ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాల‌కు శుక్రవారం ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి.. ఈ ఆరు చోట్ల అధికార తెరాస పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మిగిలిన ఆరు చోట్ల నేడు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి మొత్తం 37 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 5,326 ఓట‌ర్లు ఉన్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించ‌నున్నారు. పోలింగ్ సెంట‌ర్ల‌లోకి సెల్‌ఫోన్ల అనుమ‌తి ఉండ‌దు. సీసీ కెమెరాల‌తో పాటు వెబ్ కాస్టింగ్ చేయ‌నున్నారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేప‌ట్ట‌నున్నారు. అప్ప‌టి వ‌ర‌కు స్ట్రాంగ్ రూమ్‌ల వ‌ద్ద భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేయ‌నున్నారు.