ఎన్నికలో గెలిచి కెసిఆర్‌ మూడోసారి హ్యాట్రిక్‌ సీఎం అవుతారుః కెటిఆర్‌

KTR

హైదరాబాద్‌ః కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటదని మంత్రి కెటిఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చకా బెంగళూరు రియల్ ఎస్టేట్ 28 శాతం పడిపోయింది..తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఢమాల్ అంటదని మంత్రి కెటిఆర్‌ వివరించారు. తాజాగా ఓ చానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కెటిఆర్‌ అన్నారు. ‘తెలంగాణ సమాజం రాష్ట్రంలో మార్పు కోరుకోవట్లేదు. కెసిఆర్‌ పట్ల ప్రజలకు ప్రేమ ఉంది. తెలంగాణ సాధించిన నాయకుడిగా ఆయన పట్ల ప్రజల్లో ఆరాధనా భావం ఉంది. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్‌ గెలిచి.. మూడోసారి హ్యాట్రిక్‌ సీఎం అవుతారు. నిజం చెప్పాలంటే 2014లోనే రాష్ట్రంలో మార్పు వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా మార్పు కావాలని కోరుకుంటున్నది రాజకీయ నిరుద్యోగులే. ప్రజలు కాదు. వారు మంచి పనులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చారు.

‘చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చేంత మమకారం ఉన్న వ్యక్తి కెసిఆర్‌. మమ్మల్ని చావచితకొట్టిందే కాంగ్రెస్‌. 55 ఏండ్లపాటు అహంకారంతో ఢిల్లీ పెత్తనం రుద్ది.. 55 ఏండ్లు వందల మందిని చంపి.. ఉద్యమ కారులను పొట్టనపెట్టుకున్న కాంగ్రెస్‌ వచ్చి ఇవాళ దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా అంటే ఏమన్నట్లు. నవంబర్‌ 30 నాడు జరిగే ఎన్నిక వెయ్యి శాతం ఢిల్లీ దొరలకు.. ప్రజలకు మధ్య జరిగే ఎన్నిక. ఢిల్లీ దొరలు అని నేను ఆశామాషీగా అనట్లేదు. 1952లో ఇడ్లీ సాంబార్‌ ఉద్యమం అని మొదలుపెడితే.. ఐదుగురు పిల్లలను చంపిందే కాంగ్రెస్‌.. 1956లో ఆంధ్రతో తెలంగాణకు ఇష్టం లేని పెండ్లి చేసిందే కాంగ్రెస్‌.. 1968లో 378 మందిని పొట్టన పెట్టుకున్నదే కాంగ్రెస్‌.. 1971లో 11 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే.. కర్కషంగా వాళ్లను, ప్రజాకాంక్షను తుంగలో తొక్కి.. కాంగ్రెస్‌లో కలుపుకున్నది ఇదే ఢిల్లీ దొరలు. 2004 నుంచి 2014 వరకు చావగొట్టింది కాంగ్రెస్‌. అహంకారం అంటూ ఉన్నది ఈ దేశంలో ఎవరికైనా అంటే అది కాంగ్రెస్‌కు ఢిల్లీ దొరలకే. మార్పు కావాలి కాబట్టే 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం. 14 ఏళ్లు పోరాడి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ రాకతోనే మార్పు వచ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చారు.

తెలంగాణ మీద కెసిఆర్‌కు ఉన్నది మమకారమని.. అహంకారం కాదని అన్నారు కెటిఆర్. ప్రజల నాడి తెలిసిన నేత కెసిఆర్‌ అని చెప్పారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ రికార్డు సృష్టిస్తారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందని తెలిపారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని, తాగునీటి కోసం రూ.37 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.