ఆ సీన్ చూసి బన్నీ కి దణ్ణం పెట్టానని చెప్పుకొచ్చిన చంద్రబోస్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. పాన్ ఇండియా గా డిసెంబర్ 17 న ఈ మూవీ మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే ఉండడం తో ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మీడియాతో పుష్ప విశేషాలు పంచుకున్నారు గేయ రచయిత చంద్రబోస్.

సుకుమార్‌ స్వతహాగా కవి కావడంతో ఆయన సినిమాల్లో పాటలు రాయడం అనేది పెద్ద సవాల్ అని చెప్పుకొచ్చారు చంద్రబోస్. ‘రంగస్థలం’ తర్వాత నుంచి మా కాంబినేషన్​కు బాధ్యత పెరిగింది. నిజానికి ఆ చిత్రంలో ఏ పాటను నేను రాయలేదు. వచించాను. సందర్భం చెబుతుంటే ఆసువుగా చెప్పేసేవాడిని. ఆ చిత్ర పాటలన్నీ విడుదలయ్యాక.. లిరికల్‌ షీట్స్‌ రిలీజ్‌ చేద్దామన్నప్పుడే పాటల్ని కాగితంపై రాశాను. అందుకే నా 27ఏళ్ల సినీ కెరీర్‌లో ‘రంగస్థలం’ ఓ మధురమైన అనుభూతినిచ్చిన చిత్రమైంది.

ఇది ‘రంగస్థలం’కు పూర్తి భిన్నమైన కథ. అక్కడ చిట్టిబాబు వేరు.. ఇక్కడ పుష్పరాజ్‌ వేరు. అందులో రామలక్ష్మి వేరు.. ఈ సినిమాలో శ్రీవల్లి వేరు. కథా నేపథ్యమే చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఓ మూడు సీన్లు సుకుమార్‌ నాకు చూపించారు. అది చూసి.. సుక్కుకు, అల్లు అర్జున్‌కు దణ్ణం పెట్టేశా. ముఖ్యంగా పుష్ప పాత్ర కోసం బన్నీ ఎంతటి అంకిత భావంతో పని చేశాడో చూసి ఆశ్చర్యమేసిందని అన్నారు చంద్రబోస్.