ప.గోదావరి జిల్లాలో వాగులో పడిన ఆర్టీసీ బస్సు ..9 మంది మృతి

ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా వాగులోకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మరణించినట్లు తెలుస్తుంది. బస్సులో మొత్తం 59 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

బస్సు ఒక్కసారిగా వాగులో పడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. బస్సు డ్రైవర్ చెన్నారావు స్పాట్ లోనే చనిపోయారని కండక్టర్ రవి చెపుతున్నారు. గాయపడినవారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు బయటకు వస్తేగాని మొత్తం మృతుల సంఖ్య ప్రకటించలేమని అధికారులు తెలిపారు. వంతెన రెయిలింగ్​ను ఢీకొన్న బస్సు.. ఒక్కసారిగా 25 అడుగులు లోతుగా ఉన్న వాగులో పడింది. వేలేరుపాడు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు.

మరణించినవారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. నీటిలో పడిన బస్సు నుంచి బయటికి రాలేకే 9మంది మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్రజలు సహాయక చర్యలకు ముందుకొచ్చారు. మృతిచెందిన వారిని బస్సు కిటికీల నుంచే బయటకు తీశారు. కిటికీల నుంచి కొందరు ప్రయాణికులు బయటకు వచ్చారు. మిగిలిన ప్రయాణికులను స్థానికులు కాపాడారు.