ఎమ్మెల్యే సాయన్న అంతక్రియలకు..అభిమానుల అడ్డు

సికింద్రాబాద్‌ కంట్మోనెంట్‌ బిఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు నిలిచిపోయాయి. సాయన్న అంతిమ సంస్కారాలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరపాలని ఆయన అభిమానులు డిమాండ్ చేయడం తో అంత్యక్రియలు నిలిచిపోయాయి. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సాయన్న ఆదివారం యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయన్న మరణంతో కంట్మోనెంట్‌ లో విషాదం చోటుచేసుకుంది.

సోమవారం మధ్యాహ్నం సాయన్న నివాసం నుంచి వెస్ట్ మారేడ్‌పల్లిలోని శ్మశానవాటిక వరకూ అంతిమయాత్ర కొనసాగింది. మరికాసేపట్లో అంత్యక్రియలు పూర్తవుతాయనగా.. ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలంటూ మెరుపు ధర్నాకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో మంత్రులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.

సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి కూడా అందుకే ఏర్పాట్లు చేయలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడం లేదని మండిపడ్డారు. 30 ఏండ్లు ప్రజలకు సేవ చేసిన ఎమ్మెల్యేను ఇలా అవమానించాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ నటులకు ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నప్పుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు అధికారికంగా అంత్యక్రియలు చేయరా అని మండిపడ్డారు.