దొంగ ఓట్లతోనే నేను గెలిచా – ఎమ్మెల్యే రాపాక

janasena-mla-rapaka
janasena-mla-rapaka

జనసేన పార్టీ గుర్తు తో గెలిచి..ఆ తర్వాత వైస్సార్సీపీ పార్టీలో చేరిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వివాదంలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని.. ఉండి ఎమ్మెల్యే రామరాజు తనను సంప్రదించారని రీసెంట్ గా సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన..ఈయన తాలూకా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తాజాగా ఓ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను దొంగ ఓట్లతోనే గెలిచానని.. తన సొంత గ్రామమైన చింతలమోరిలో భారీగా దొంగ ఓట్లు పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత గ్రామానికి చెందిన వారే కాక పక్క ఊర్ల నుంచి కూడా కొందరు వచ్చి తనకు దొంగ ఓట్లు వేశారని అన్నారు. ఒక్కొక్కరూ పది దొంగ ఓట్లు వేయడం వల్లే తాను గెలిచేవాడినని.. అప్పటి నుంచి తన గెలుపుకు దొంగ ఓట్లే కారణమంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఇదే ఇప్పుడు రాపాకను ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తనకు రూ.10 కోట్లు ఆఫర్ చేసినా వెళ్లలేదని.. విలువలకే కట్టుబడ్డానన్న రాపాక వ్యాఖ్యలకు.. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ వ్యాఖ్యలు పొంతన లేకుండా ఉన్నాయంటున్నారు. అసలు రాపాకకు అంత సీనుందా? సొంత గ్రామంలోనే అధికార పార్టీలో ఉండి సర్పంచ్ ను గెలిపించుకోలేని ఆయనకు టీడీపీ రూ.10 కోట్లు ఆఫర్ చేస్తుందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.