సికింద్రాబాద్లో బోనాల సందడి ..

సికింద్రాబాద్లో ఉజ్జయినీ మహంకాళి బోనాల సందడి నెలకొంది. అమ్మవారి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల సమన్వయంతో భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి 17న బోనాలు, 18న రంగం నిర్వహించనున్నారు. అమ్మవారికి ఉదయం 4 గంటలకు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సమర్పించారు. అమ్మవారికి సాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, రంగం, పోతరాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు.. ఇలా రెండు రోజల పాటు ప్రధాన ఘట్టాలు ఉంటాయి. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు అనుగుణంగా మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

ఇందులో బోనాలు సమర్పణకు రెండు, సాధారణ భక్తులకు రెండు, ఒకటి వీఐపీ, మరొకటి డోనర్‌ పాస్‌ క్యూలైన్లుగా కేటాయించారు. బోనాల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు 3500 మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణం, అంజలి టాకీస్‌, సంతోష్‌ స్వీట్‌ హౌస్‌ వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనరల్‌ బజార్‌, మహంకాళి ఠాణాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం గ్రేటర్‌ జోన్‌ పరిధిలో 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది టీఎస్ ఆర్టీసీ.