మేడిగడ్డ..పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం, మంత్రులు

Medigadda..CM and Ministers inspected the area where cracks had formed

హైదరాబాద్‌ః మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. తొలుత బ్యారేజీ పైనుంచి కుంగిన పిల్లర్లను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యారేజీ దిగువ భాగంలో కుంగిన పిల్లర్ల వద్ద ఏం జరిగిందో అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఆ తర్వాత 21వ పిల్లర్ వద్ద కుంగిన ప్రాంతం, పగుళ్లు ఏర్పడిన ప్రాంతాన్ని సీఎం బృదం పరిశీలించింది. ఏడో బ్లాక్ లోని పలు పిల్లర్లను వీరు పరిశీలించారు. పగుళ్లు ఏర్పడిన ప్రాంతాలను రేవంత్ ప్రత్యేకంగా పరిశీలించారు. అంతకు ముందు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ… రూ. 95 వేల కోట్లను ఖర్చు చేస్తే… 97 వేల ఎకరాలకు కూడా నీరు అందడం లేదని విమర్శించారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ధన దాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని ఆయన అన్నారు.

కాగా, ఈ రోజు ఉదయం మేడిగడ్డ ఆనకట్ట కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు శాసనసభ, మండలి సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక బస్సులో వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. మేడిగడ్డ సందర్శనకు సభ్యులందరిని ప్రభుత్వం ఆహ్వానించగా బిఆర్ఎస్ , బిజెపి ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, సీపీఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్సైలు, సుమారు 800 మంది పోలీసు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.