వారికి రుణమాఫీ లేదు – తెలంగాణ సర్కార్

తెలంగాణ సర్కార్..త్వరలో రైతుల రుణమాఫీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ మేరకు అధికారులు ఆ పనుల్లో బిజీ గా ఉన్నారు. కాగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు రుణమాఫీ వర్తింపజేయొద్దని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులకూ మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ. 10వేల కోట్లను ఇప్పటికే సిద్ధం చేసుకోగా, TGIIC భూములను బ్యాంకులకు తనఖా పెట్టడం ద్వారా రూ.10వేల కోట్లు, రుణాల రూపంలో మరో రూ. 10వేల కోట్లను సమకూర్చుకోవాలని భావిస్తోంది.

ఇక అర్హులైన వారికే రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. సంపన్నులు, పన్నులు కట్టేవారిని పథకం నుంచి తొలగించాలని సూచించారు. రైతు భరోసా నుంచి వ్యవసాయం చేయని భూములు తొలగించాలన్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలపై దృష్టి పెట్టారని తెలిపారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.