‘నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు’ అంటూ వైస్సార్సీపీ ఎమ్మెల్యే కీలక కామెంట్స్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. మూడు నెలలుగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని వాపోయారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తనకు ముందే తెలుసునని.., తాను సీక్రెట్స్ మాట్లాడుకునేందుకు వేరే ఫోన్ వాడుతున్నట్లు తెలిపాడు.

“ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్ ను మీ పెగాసస్ రికార్డు చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? నిఘా కోసం నా నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని ఏర్పాటు చేసుకోండి. క్రికెట్ బెట్టింగ్ కేసులప్పుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారు” అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

ఏపీ రాజకీయాల్లో కోటంరెడ్డి తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గత కొంత కాలంగా పార్టీపై అసంతృప్తిలో ఉన్న ఆయన.. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ వ్యాఖ్యనించటం చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి ఆశించి కోటంరెడ్డి భంగపడ్డారు. నెల్లూరు జిల్లా నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డికి పదవి ఇవ్వటంతో గత కొంత కాలంగా ఆయన పార్టీపై అసంతృప్తిలో ఉన్నారు.