ద్వేషాల మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని తెరిచా: రాహుల్ గాంధీ

యాత్ర ఎందుకనేవారికి ఇదే నా సమాధానమన్న రాహుల్ గాంధీ

‘I am opening a shop of love in the market of hatred’: Rahul Gandhi on Bharat Jodo Yatra

న్యూఢిల్లీ : ఇంగ్లిష్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, బిజెపి ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన సభలో రాహల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నువ్వు ఏం చేస్తున్నావ్? కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎందుకు నడుస్తున్నావని’ బిజెపి నేతలు తనను ప్రశ్నిస్తున్నారన్న రాహుల్ గాంధీ.. ద్వేషపూరితం చేసే ఓ మార్కెట్‌లో ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచానని వారికి చెబుతున్నానని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్, నెహ్రూ, ఆజాద్ వంటి నేతలందరూ ఇలాగే ప్రేమను పంచారని, ఇప్పుడు తాను వారి బాటలోనే నడుస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్ మంత్రులందరూ నెలకోసారి ప్రజల్లోకి వెళ్లాలని రాహుల్ సూచించారు.

బిజెపి నేతల ‘హిందీ భాష’ ప్రచారంపై రాహుల్ మాట్లాడుతూ.. హిందీ, తమిళం, ఇతర భాషలు చదవొద్దని తాను చెప్పడం లేదన్నారు. అయితే, ప్రపంచంలో ఇతరులు ఎవరితోనైనా మాట్లాడాలంటే అది ఒక్క హిందీతోనే సాధ్యం కాదని, ఇంగ్లిష్‌తో మాత్రమే సాధ్యమన్న విషయాన్ని తాను చెబుతున్నట్టు స్పష్టం చేశారు.

కాగా, రాహుల్‌గాంధీ గత కొన్నాళ్లుగా భారత్‌ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్‌ జోడో యాత్ర కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ మీదుగా రాజస్థాన్‌కు చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర కొనసాగుతున్నది. కశ్మీర్‌లో ఈ యాత్ర ముగియనుంది.