లోకేశ్ పాదయాత్రకు కర్ణాటకు పోలీసుల భద్రత

నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మూడవరోజు యాత్ర పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు శాంతిపురం మండలం గ్రామాలకు పాదయాత్ర చేరుకోవడం ,ఇవి కర్ణాటక సరిహద్దుల్లోని గ్రామాలు కావడంతో కర్ణాటక పోలీసులు లోకేశ్ పాదయాత్రకు భారీ భద్రత కల్పించారు. లోకేశ్ చుట్టూ వలయంగా ఏర్పడి పాదయాత్ర సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక పోలీసు విభాగానికి చెందిన డీఎస్పీ, రోప్ పార్టీ, కానిస్టేబుళ్లు కుతేగాని గ్రామం వద్దకు చేరుకుని లోకేశ్ పాదయాత్ర భద్రతలో తోడ్పాటు అందించారు.

లోకేష్ ఈరోజు గుండిసెట్టిపల్లి లో పాడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పశువులు కొనడానికి 50 శాతం సబ్సిడీ ఇచ్చారని, ఎస్సీలకు 70 శాతం సబ్సిడీ ఇచ్చారని వెల్లడించారు. టీడీపీ హయాంలో సబ్సిడీతో దాణా, సైలేజ్ తక్కువ రేటుకి ఇచ్చేవారని తెలిపారు. కానీ వైస్సార్సీపీ పాలనలో సబ్సిడీలు లేవు, దాణా, సైలేజ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. లీటరుకు రూ.4 బోనస్ ఇస్తామని మోసం చేశారని లోకేశ్ మండిపడ్డారు.

చంద్రబాబు మొదటి నుండి పాడి రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఉంటే రైతులు ఆర్దికంగా బలంగా ఉంటారు అనే ఆలోచనతో చంద్రబాబు పాడి రైతులను ఎక్కువగా ప్రోత్సహించారు. రెండు రూపాయిలకే కిలో సైలేజ్ టీడీపీ హయాంలో అందజేసాం. టీడీపీ హయాంలో మినరల్ మిక్చర్, సైలేజ్, చాపింగ్ మెషీన్లు సబ్సిడీకి ఇచ్చాం. జగన్ కి పాడి పరిశ్రమ మీద అవగాహన లేదు. సహకార సంఘాల డైరీలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది. జగన్ రెడ్డి చిత్తూరు, ఒంగోలు డైరీలను అమూల్ కి కట్టబెట్టాడు. రూ.650 కోట్ల ఆస్తులు విలువున్న చిత్తూరు డైరీ ని అమూల్ కి కట్టబెట్టడం దారుణమని లోకేష్ మండిపడ్డారు.